వలస కార్మికులు దేశంలో ఇంకా వున్నారు అంటే, అది మనం సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం కాదా? భారత్ వెలిగి పోతుంటే మరి ఈ వలసలు ఏమిటి? కరోనా వలన ఇంత మంది పరాయి పంచన బతుకు ఈడుస్తున్నారనే సత్యం వెలుగు చూసింది. మరి తెలిసి మనం చేస్తున్నది ఏమిటి? నారద పాత్ర పోషిస్తున్న మీడియా ఇలాంటి వాటిని వెలుగు లోకి తెచ్చి, ఇంటెలెక్చవల్స్ తో డిబేట్స్ ఎందుకు పెట్టవు?
ఎంత సేపు, నేను నా పార్టీలు పదవిలోకి రావాలి, ప్రభుత్వ సొమ్ముని జుఱ్ఱు కోవాలి అన్న యావ తప్ప, భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరు గౌరవప్రదమైన జీవితం సాగించాలని దానికి కావలసిన ప్లానింగ్ చెయ్యాలని మన నాయకులు అని అనుకొంటున్న వాళ్ళు ఎందుకు అనుకోవడములేదు. చల్లకొచ్చినమ్మ ఎంతకాలం ముంత దాస్తుంది? మేము బాగానే వున్నాము అని దాగుడుమూతలు ఎంతకాలం?
పప్పు బెల్లాలు పంచి నోరు తీపిచేసాములే అని దాటవేత ధోరణితో పాలన సాగించడము ఈనాటి మేటి నాయకులకే చెల్లింది. నేను బాగా లేక పోయినా పర్లేదు, రేపటి తరం కోసం పునాది వేస్తున్నా అని చెప్పిన పుస్తకాలలో చదివిన తాత ఏమిటి అంజనం వేసి చూసినా సెంటర్ లో కనబడటం లేదు?
వీరిది ఏ కులం? ఏ మతం? కొంచెం చెబితే మన నాయకుల నుండి మరియు వారి వెనకాల వున్న మీడియా నుండి వినాలని వుంది. కులం అండతో గెలిచిన పాలకులు కనీసం వాళ్ళకులాల వాళ్ళైనా వలస కార్మికులు కాకుండా అభివృద్ధి చేశారా? మరి ఆలా అయ్యి ఉంటే ఇప్పటి వలస కార్మికులలో కమ్మ, రెడ్డి లేరని చెప్పగలరా? పేద వాడిని కులం పేరుతో సమాజం నుండి వేరు చేసే కుతంత్రం ఇంకెంతకాలం సాగుతుందో? ఏమో నాకేటి తెలుసు? ఆ శివయ్య ఏటనుకొంటున్నాడో ఏటో ?
జై హింద్,
శరభయ్య పోలకం
Comments
Post a Comment